ఆయిల్ పామ్ లో అదరహో....
ఆయిల్ పామ్ లో 19.32 నూనె ఉత్పత్తి శాతంతో తెలంగాణ నంబర్ వన్ ఉందని దేశంలో దాదాపు 9.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. దేశంలో, సాలీనా100 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పామ్ ఆయిల్ డిమాండ్ ఉండగా, వార్షిక ముడి పామ్ఆయిల్ ఉత్పత్తి ఏడాదికి 2.90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నది. ఈ లోటును దేశం దిగుమతుల ద్వారా సమకూర్చుకుంటున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. దేశంలో పామ్ ఆయిల్ స్వయం సమృద్ధి సాధించాలంటే అదనంగా 70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు అవసరం. తెలంగాణ రాష్ట్రానికి సుమారు 3.66 లక్షల టన్నుల పామ్ ఆయిల్ అవసరం కాగా ప్రస్తుతం 52,666టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది. అన్ని నూనె గింజల పంటలకన్నా ఆయిల్ పామ్ లో ఎక్కువ దిగుబడినిస్తుంది (ఎకరానికి 10-12 టన్నులు ), 25 – 30 సం. వరకు సంవత్సరానికి సుమారు రూ.1,20,000/- నుండి రూ.1,50,000/- వరకు, ఆదాయం పొందవచ్చు. రాష్ట్రంలో వివిధ పధకాలకింద 2021-22 సం. వరకు 68,440 ఎకరాలు,(13,302 రైతులు) ఆయిల్ పామ్ సాగు కిందకు వస్తాయి. పంటల వైవిధ్యీకరణ నేపథ్యంలో సుమారు 20.00 లక్షల ఎకరాలలో పామ్ ఆయిల్ సాగుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 27 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 11 కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్‌లను కేటాయింపు చేయడం జరిగింది. 2022-23 ఏడాదికి గాను ఇప్పటివరకు 61277 ఎకరాలలో ప్రగతి సాధించడం జరిగిందని 2023-24 సం. కి గాను,2.00 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు మొక్కల పెంచేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది.