08 Mar , 2023

వరి వద్దు ఇతర పంటలతో లాభాలు పొందుదాం.

గతంలో ప్రధానంగా రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి సాగు చేసేవారు. దీంతో సాగుకు ఖర్చు తక్కువ కావడంతో పాటు ఎరువులు, కూలీల ఖర్చు తక్కువగా ఉండేది. పండించిన ధాన్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో రైతులకు ఎక్కువ లాభాలు వచ్చేవి. 30 ఏండ్ల కిందట రైతులు ప్రజలకు నిత్యం ఉపయోగపడే పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం భూములన్నీ అన్ని పంటల సాగుకు అనుకూలమైనా రైతులు కూడా వరిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. ఒకే రకమైన పంటలు సాగుచేయడం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడి తక్కువగా వస్తున్నది. పంట ఉత్పత్తులు ఎక్కువ కావడం వల్ల మద్దతు ధర లభించడం లేదు. దీంతో మార్కెట్లో మిగతా పంట ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సాగుచేపడితే మేలని వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆరుతడి పంటలు సాగుచేయడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించొచ్చని చెబుతున్నరు. గతంలో రైతులు వేరుశనగ, పప్పుశనగ, పొగాకు, మొక్కజొన్న, కుసుమ, పత్తి, ఆముదం, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, మినుములు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, పెసర్లు, కంది, అలసందలు, వాము తదితర పంటలు సాగు చేసేవారు. ఈ పంటలకు పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా వచ్చేవి. రైతులు ఇతర పంటలు పండించి లాభాలు పొందాలని ప్రభుత్వం కోరుకుంటుంది.