కొయ్యూరులో జ్యూస్, సోడా యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు !!
మండలంలో జీడి మామిడి సాగు ప్రధానమైంది. మండలంలోని 33 పంచాయతీల్లో సుమారు 40 వేల ఎకరాలకు పైగానే జీడిమామిడి తోటలు విస్తరించి ఉన్నాయి.. ఈ తోటల్లోని పండ్లను కొన్ని సార్లు వృథాగానే బయట పారే స్తుంటారు. ఈ పండ్లతో జీడి మామిడి జ్యూస్, సోడా తయారు చేయించే యూనిట్ని కొయ్యూరులో నెలకొల్పేందుకు వెలుగు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ అదే శాల మేరకు వెలుగు ఏపీఎం శ్రీనివాస రావు, సిబ్బంది గంగవరం మండలంలో ఏర్పాటు చేసిన యూనిట్ను ఇటీవల పరిశీలించారు. ఓ సంస్థ సుమారు 20 లక్షలతో జ్యూస్, సోడా తయారు చేసి యంత్రాలను అందించింది. వీటికి మంచి డిమాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఇలా తయారు చేసిన సోడా ఆరు మాసాల పాటు నిల్వ చేసే అవకాశం ఉంది. రైతులకు సైతం ఆర్ధికంగా ఉపయోగం ఉంటుంది. కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ఏడాదిలోనే జీడిమామిడి పండ్ల జ్యూస్, సోడా యూనిట్ అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.