పొలాల్లో మిగిలిన వరి గడ్డిని కాల్చొద్దు
వరి కోతల తరువాత రెక్క నాగలి లేదా మల్చర్ సహాయంతో వరి గడ్డి పొలంలోనే కలియదున్నలి. గడ్డి తక్కువగా ఉన్నప్పుడు రోటోవేటర్ కూడా నడిపించే వీలుంటుంది. వరికొయ్యలను కాల్చితే నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని, కాల్చడం ద్వారా విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, ఫాస్ఫరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది, దిగుబడీ పోతుంది, భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోయి, పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి. పొలాల్లో తిరిగే అనేక జీవరాసులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. పొలాల గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు కాలిపోవడంతో పర్యావరణానికి హాని కలుగుతుంది. ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాల దగ్గరే ఉన్న ధాన్యం కాలిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు.