భారత దేశంలో నిషేదించబడిన సస్యరక్షణ మందులు !!
పంటల దిగుబడులను పెంచడానికి పంటలకు ఆశించే చీడపీడల నుంచి రక్షించడం తప్పనిసరి. అనేక పంటలలో సుమారుగా 15–20% వరకు పంట నష్టం కేవలం చీడపీడల వలన కలుగుతుంది. రైతులు చీడపీడల నుండి పంటలను కాపాడుకోవడానికి ఎక్కువగా సస్యరక్షణ రసాయన మందులను వాడుతున్నారు. సుమారుగా 60-65% కీటకనాశినుల వాడకంగా నమోదు చేయబడినది. అయితే, మానవాళి మరియు జీవరాశులకు హాని కలిగించే అత్యంత ప్రమాదకరమైన నాలుగు సస్యరక్షణ మందుల వాడకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ నెం. యస్.ఓ. 4294(ఇ) ప్రకారం 4 మందుల వాడకం విషేదించడమైనది. 1.డైకోఫాల్, 2.డైనోకాప్, 3.మిథోమిల్, 4.మోనోక్రోటోఫాస్ మందుల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ అక్టోబర్ 6, 2023 పురుగుమందుల (నిషేధం) ఆర్డర్ను కేంద్ర ప్రభుత్వం ప్రచురించడం జరిగింది. మోనోక్రోటోఫాస్ 36% ఎస్ ఎల్ మందును ప్రస్తుతం ఉన్న స్టాక్ క్లియర్ చేసుకొనేందుకు నిల్వల గడువు కాలం ముగిసే వరకు మాత్రమే అమ్మకాలు పంపిణీ, వినియోగానికి అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది.